Saturday, February 21, 2015

మాతృభాష

మాతృభాష రా ఇది! మృతభాష కాదిది!!
వెయ్యేండ్ల వైభవం ఇది! వెన్నభాష రా ఇది!!
"దేశభాషలందు తెలుగు లెస్స" అంటే
సరళం,సులభం అని రాయలోరి మాటది!
ఆంగ్ల పంకిల పంక్తులలోని ' లెస్స్ ' కాదిది!!

ఉచ్ఛరణలోని మధురం!
అలంకారాల అంకురం!
ఛలోక్తి ఛందోప్రయోగ కర్మాగారం!
యతిప్రాస పదమైత్రిల అనురాగం!
యాసప్రయాసల వైరుధ్య భేదగానం!

ఆంగ్ల అయ్యోరు బ్రౌన్ ఆస్వాదించిన  తాళపత్ర గ్రంధాలు!
తాళ్ళపాక అన్నమయ్య ఆలపించిన తేటతెనుగు గేయాలు!

దేశమంటే మట్టికాదు మనుజులని
నరుల కీర్తిని గుణించిన గురజాడ పాఠాలు!
పదండి ముందుకు పదండి త్రోసుకని
నరనరాల ఉత్తేజం నింపిన శ్రీశ్రీ రచనాస్త్రాలు!

ఇవి గదా మన సంస్కృతి!
మనః నమోస్తుతి త్రిలింగ భాషకు!
అట్టి తీయనైన నా తల్లి తెలుగు దేవేరికి ప్రణామాలు!!

No comments:

Post a Comment