Sunday, December 6, 2015

నాలుగు అడుగుల నారీశిఖరం

                                ఈ రోజు మీకో కథ చెెబుతాను.అనగనగా అది ఢిల్లీ నగరం. అందులో ఒక చిన్న కుటుంబం. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగులు. చీకూచింతా లేకుండా ఉన్నవారికి కలిగిన సంతానం ఆనందంతో పాటు వ్యథను కూడా మిగిల్చింది.ఆడబిడ్డ, అందునా పుట్టకతోనే వెన్నెముక్కకు సంబంధించిన వైకల్యం బారిన పడింది. 'స్కోలియాసిస్' అనే ఈ సమస్య వల్ల శారిరకంగానూ ఎత్తు ఎదగలేకపోయింది.తను అలా అయిపోయిందేమోనని బాథ లోలోన ఆమె తల్లితండ్రులకు ఉందేమో తెలియదుకానీ ఆ బాథ,నిరాశలను ఆ పిల్ల జోలికి రానివ్వలేదు.థైర్యం నూరిపోశారు. ఆర్మీస్కూల్ లో చేర్పించారు. ఆ వాతావరణం ఆమెలో తెగువ కలిగించింది. బీ.టెక్ అదే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఆపై ఎం.బీ.ఏ చదివింది.

                              అక్కడితో ఆగిపోతే మనం ఈరోజు ఈ కథ చెప్పుకోల్సిన అవసరంలేదు. ఎం.బీ.ఏ పూర్తయ్యాక రెండేళ్ళపాటు మీరెంతో ఇష్టపడే చాక్లెట్ కంపెనీ "క్యాడ్బరీ"లో ఉద్యోగంలో చేరింది. స్పానిష్ కూడ నేర్చుకుంది. అక్కడ కంపెనీలో  నెలకు లక్షల జీతం వచ్చేది.కానీ తన మనసు అటువైపు మొగ్గలేదు. ఊహ తెల్సినప్పటి నుండి తన మదిలో తన తోటి జనాలకు, ఏదైనా చేయాలనే బలమైన కాంక్ష ఉండేది. దానికి కలెక్టర్ అవటమే సరైంది అనుకుంది. అప్పటివరకూ కలిగిన చిన్నచిన్న అవరోధాలను సులభంగా దాటింది.

                             కానీ ఇప్పటి లక్ష్యం సివిల్స్ పరీక్షలో నెగ్గటం. అంటే ప్రతీ సంవత్సరం సుమారు పదిలక్షల మంది నమోదు చేసుకుని సగం మంది భయంతో పరీక్షకు హాజరు కానటువంటి పరీక్ష. హాజరు ఐన 5లక్షలమందిలో కేవలం 15వేలమందే ప్రిలింస్ అనే తొలిదశను దాటుతారు. ఈ 15వేలమందిలో కేవలం 3500మంది మాత్రమే మెయిన్స్ అనే రెందో దశను దాటుతారు. ఇక ఆఖరు దశ  ఇంటర్-వ్యూ దాటి ప్రజాసేవకులుగా ఉద్యోగం సంపాదించేది కేవలం 1300మంది. ఇంత కష్టమైన లక్ష్యం తనముందుంది. రేయింబవలు చదివింది. ఉదాహరణకి తన ఆప్షనల్ సబ్జెక్ట్ జాగ్రఫి కోసం రమారమీ 20పుస్తకాలు చదివేది. మొదటి ప్రయత్నంలోనే 815వ ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుకు ఇండియన్ రెవెన్యూ సర్వీసుకి వెళ్ళాలి.

                           వెళ్ళిపోగలిగుంటే ఈ కథకు ఇప్పుడు ప్రత్యేకత ఉండదేమో! ఎందుకంటే తెలుగు సినిమాలోలాగా,'ఎంత పెద్ద విలన్ లేదా కష్టాన్ని ఓడిస్తే అంత పెద్ద హీరోగా మరి!' మన హీరో ఎదుర్కున్న కష్టం ఏంటో చెబుతాను. ర్యాంక్ అయితే వచ్చింది. కానీ 'సిబ్బంది,శిక్షణ విభాగం'ఒకటుంది. ఉద్యోగానికి మునుపు అక్కడ తర్ఫీదునిస్తారు. అక్కడే చిక్కువచ్చింది. ఆమె అక్కడ అధికారిగా చేయలేవని మోకాలడ్డింది.

                          వాళ్ళు చూపిన కారణం ఏంటంటే ఆమె ఇంచుమించు నాలుగు అడుగులే ఉందంట. అంతేనా! " ఓ అధికారిగా మీకొచ్చే బరువైన పార్శిళ్లను ఈ వైకల్యంతో విప్పలేరు!" అని అభ్యంతరం చెప్పింది." ఓ అధికారిగానే కాదు;కనీసం క్లర్క్గా కూడా ఉద్యోగం చేయలేవు.ఇంకా చెప్పాలంటే చీపురుతో ఊడ్చే పనికీ నువ్వు పనికిరావు." అని కర్కసంగా చెప్పారు. ఎంత పెద్దమాటలు ఇవి. శరీరక వైకల్యం కన్నా ఈ మాటలు మానసికంగా ఎంతో క్రుంగదీసాయి. సివిల్స్ ద్వారా ఎంపికైనా తనకే ఇన్ని అభ్యంతరాలుంటే ,ఇదేలాంటి వైకల్యమున్న మామూలు అమ్మాయిల పరిస్థితేంటి? ఆ క్రుంగిన దశలోను తన లోపలి ఆలోచనలు ఇవే.

                         అందుకే దీనిపై గట్టిగా పోరాడాలనుకుంది. న్యాయపరంగా పోరాటం మొదలుపెట్టింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (క్యాట్) లో "నేను అధికారిగా  అర్హురాలినే!" అంటూ పిటీషన్ వేసింది. అలా వేశాక నెలలపాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. రకరకాల వైద్యపరీక్షలు చేసారు. 62% వైకల్యం ఉన్న ఆమె 10కిలోల మేర బరువు కూడా ఎత్తగలదని వైద్యులూ ధృవీకరించారు! క్యాట్ దిగివచ్చి ఆ ఉద్యోగానికి అర్హురాలివేనని తీర్పిచ్చింది. రెవెన్యూ మరియు కస్టంస్ డిపార్ట్మెంటులో అసిస్టెంట్ కమీష్నరు గా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల విభాగంలో ప్రొబేషనరీ ఆఫీసరుగా చేరింది.

                       ఇంకా కథ అవ్వలేదు. క్లైమాక్సుకు వద్దాం. ఈ కేసులు తిరగడాలతో ఆమె ఖాళిగా ఉండలేదు. మళ్ళీమళ్ళీ సివిల్స్ రాసింది. హైదరాబాద్ లో చేరి సంవత్సరం తిరగక మునుపే సివిల్స్ లో మొదటి ర్యాంకు సాధించింది. అలా సాధించిన తొలి వికలాంగురాలిగా తన పేరు నిలిచిపొయింది.అందునా 50ఏళ్ళు పైబడిన సివిల్స్ చరిత్రలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన ఘనత.కొసమెరుపు ఏంటంటే ఊడ్చటానికీ పనిరావనీ అన్న శిక్షనావిభాగం నుండే ఆమెకు ఫోన్ వచ్చింది. "మంత్రిగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు" అని అభినందనలు అవి.
     
                      ఇది కల్పితమైన కథ కాదు అని ఇప్పటికే మీకు అవగతం అయ్యుంటుంది. ఇది "ఇరా సింఘాల్" జీవితంలోని కొన్ని ఘట్టాలు. ఈమె కథ చెప్పటానికి గల కారణం ఏంటంటే - జీవితంలోని కొన్ని మనకు లేవు. అందరిలా నేను లేను. లోపల శాపగ్రస్తుడిని అనుకుంటూ , జీవితం అంటే ఏడుపే అనుకునే వారికి చిన్న స్ఫూర్తిని ఇవ్వటం. జీవితం లో అందరూ సమానులే. ఎందుకంటే దేవుడు అందరిలోనూ ఉంటాడు.ఆ లోపలి దైవాన్ని పూజించటానికి ఒకటే దారి ఆశావాదం.దృఢసంకల్పం , ఓటమికి లొంగని పొగరు, తెగువ అనేవి మనలోని దైవానికి మనము ఇవ్వగల నైవేద్యం.      

Saturday, December 5, 2015

నిజం నిగూఢం

నిజమేదో నిగూఢమేదో
తెలిసేది ఎవ్వరికీ..

కథయేదో కల్పన ఏదో
పట్టేది ఎవ్వరికీ..

భావమేదో భ్రాంతి ఏదో
తెలిపేది ఎవ్వరికీ..

ఊసేదో ఉసురేదో
చెప్పేది ఎవ్వరికీ..

పరిపరి విధముల తెలిపిన
తపనల వెనుక తలపన
తెలిసేది ఎవ్వరికీ..

పదిపది పధముల తిరిగిన
మలుపుల వెనుక వగపును
తెలిపేది ఎవ్వరికీ..

సాగరమధనం ముందర
నానా నదుల చేపొందిన
విలువలవాటా దక్కేదెవ్వరికీ...