Monday, June 29, 2015

మది మధనం

మళ్ళీ వచ్చింది నేడు;
రేపంటే భయంతో..
కూడిన ఆశల నయనం!
మళ్ళీ వచ్చింది నేడు;
ప్రశాంతపు గమనం ను..
వీడిన ప్రలోభ పయనం!
ఇల్లు వదిలి..ఊరు వదిలి..
అక్కరలనొదిలి వెడలుతున్నా;
చేరుకుంటానో లేదో తెలియకున్నా!
నడి బాట నదిలో ఆగిపోతానో;
చివరి మజిలి చాలించి ఎదిగిపోతానో!
పైకి భీకరంగా కదులుతున్నా;
గుండెలో భీతి కుదుపుతుంది!
అడుగేసాక వెనక్కి రాలేని..
కాల ప్రయాణం లో ;
ఎదురేగాక వెన్ను చూపలేని..
విధిపోరాటం లో;
గెలుపోటములు తెలియదు కానీ;
ఆర్తి ఆరాటం తీరుతుందేమో!
ఎన్ని వేళ్ళు నన్ను దోషిగా చూపుతాయో;
ఎన్ని చేద్వయాలు తమ ధ్వనులతో నన్ను చేరుతాయో!
భవిష్యవాణి తెలీని యువకుడి;
అంతర్వాణి మది మధనమిది వినండి!!

Wednesday, May 20, 2015

నేను-నారాయణ

పంచేంద్రియాలన్నీ.. పంచకట్టులో కట్టి..
పార్టీకి రాసిస్తి నారాయణ..
నాకులపొడే గొప్పోడు..
నా నాయకుడు ఒక్కడే నారాయణ..
వాడేను రామయ్య. నేనేమో హనుమయ్య..
నావంటూ నిర్ణయాలు తీస్కోను నారాయణ..
నడిపేది వాడాయే.. నడిచేది నేనాయే
నడిమిట్ల నువ్వేడా నారాయణ..
దూకమంటే దూకుతాను.. ఈత రాకున్నాను..
మా అయ్యోరు మాటాయే నారాయణ..
అతగాడు మార్గదర్శి.. నేనేమో బాటసారి.
నిదర్శనం నీవాయె నారాయణ..
ఎవడైనా ఎదిరిస్తే అంతునేను చూస్తాను..
నావంతు చూసేది మటుకు నువ్వే నారాయణ..
పొలాలు చెరూలు పోయి గోల్ఫ్ మైదానాలు రానియ్యి
మా అయ్యకు చూపు మందం నారాయణ.
నా కట్టె కాలెదాకా రాజు గారి జాగీరు..
నేనవుతా ఆరి పాలేరు నారాయణ..
ఇట్టాగే ఉండనివ్వి... మా పేపరే చదవనియ్యి..
బడికెట్టాగు రేకు లేదు నారాయణ..
దొరబాబు వాడి బాబు  రానియ్యి..
రాచరికం పెజలె ఇవ్వనియ్యి నారాయణ.

--శరత్చంద్ర




Monday, May 18, 2015

విలువేలేని మమత


ఎన్నో ఉన్నా అన్నీ నువ్వే అనుకున్నా..
ఎంతో కాలం నీవై నేను బ్రతికున్నా..

నీ కనులకు మనసుకు చేరువలేనా!
నీ కాంక్షకు మీమాంసకు చేరలేదా!!
http://raatalu.blogspot.in

చెరలోనా ఉంచేసి చర్రున ఎగిరావా!
ఆశల్లో ముంచేసి అమాంతం విడిచావా!
గతమంతా చిదిమేసి కనుమరుగయ్యావా !
రేపన్నది లేకుండా  యెదలో గాయం రేపావా!
నాపుట్టుక విలువంత మట్టిలో కలిపిన మమతవా!!




ఏముంది?



ఏముంది నీకు నాకు నడుమ?
తరిగిన మాటలు కరిగిన కలలు
చెదిరిన ఆశలు కదలని కలతలు
కూలిన కోటలు తగిలిన కోతలు
నిట్టూర్పు శ్వాసలు నిస్తేజపు నడకలు
నిన్ననే నిశిలో కలిసిన మనసులు
ఇంతకు మించి ప్రళయపు ఏకాంతం
మిగిల్చి మాయమయ్యావే నువ్వెక్కడ?

Saturday, May 9, 2015

వెలకట్టలేని యువరాణి::



చిరుజల్లుల నగవుకు సరితూగు సిరులు ఎక్కడ?
మృదుకోమలి మోముకు సరిపోవు మల్లెలు ఎక్కడ?
సుకుమారి సోకుకు సరిసాటి సొగసు ఎక్కడ?
వయ్యారి సొంపుకు సరిపాటి మయూరి ఎక్కడ?
యువరాణి విలువకు వెలకట్టే కుబేరుడు ఎక్కడ?

Saturday, February 21, 2015

మాతృభాష

మాతృభాష రా ఇది! మృతభాష కాదిది!!
వెయ్యేండ్ల వైభవం ఇది! వెన్నభాష రా ఇది!!
"దేశభాషలందు తెలుగు లెస్స" అంటే
సరళం,సులభం అని రాయలోరి మాటది!
ఆంగ్ల పంకిల పంక్తులలోని ' లెస్స్ ' కాదిది!!

ఉచ్ఛరణలోని మధురం!
అలంకారాల అంకురం!
ఛలోక్తి ఛందోప్రయోగ కర్మాగారం!
యతిప్రాస పదమైత్రిల అనురాగం!
యాసప్రయాసల వైరుధ్య భేదగానం!

ఆంగ్ల అయ్యోరు బ్రౌన్ ఆస్వాదించిన  తాళపత్ర గ్రంధాలు!
తాళ్ళపాక అన్నమయ్య ఆలపించిన తేటతెనుగు గేయాలు!

దేశమంటే మట్టికాదు మనుజులని
నరుల కీర్తిని గుణించిన గురజాడ పాఠాలు!
పదండి ముందుకు పదండి త్రోసుకని
నరనరాల ఉత్తేజం నింపిన శ్రీశ్రీ రచనాస్త్రాలు!

ఇవి గదా మన సంస్కృతి!
మనః నమోస్తుతి త్రిలింగ భాషకు!
అట్టి తీయనైన నా తల్లి తెలుగు దేవేరికి ప్రణామాలు!!

Monday, March 10, 2014

గందరగోళం


ఎన్నికల వేళ,ఎన్ని కలలో;
ఓటరు జాతర మొదలు-మూడునెలల మునుపె;
బహిరంగ సభలు-బలప్రదర్శనలు;
వాగ్దానాలు-వాగ్వాదాలు;
సర్వేలు-సంప్రదింపులు;
గోడ మీద పిల్లులు- గుంటనక్కలు;
పార్టీ స్థాపనలు-ఫిరాయింపులు;
అభివృద్ది జపం చేస్తూ-అవకతవకలు;
అవినీతిపై పోరాటం అంటూ-దందాలు కబ్జా ఘనులకు టికెట్లు;
నిజాయితీగా నిలబడ్డ వారికేమో.. నిరుత్సాహపు ఇక్కట్లు;
క్రిమినల్ కేసులు విద్యార్హతలు చూడంది సామీ,
కులమతప్రాంతీయతల కండూతిని వదలందెహే ;
అంటుంటే వస్తున్న వ్యతిరేకతలో సగంలోసగం;
మీకోసం నిలబడుతున్న వారికి అందించరు ఆలంబన ;
బదులు నెగ్గరంటూ ఊరికి ముందే చేస్తారు అవహేళన;
జయాపజయాలు తప్ప ధర్మాధర్మాలు ,
తప్పొప్పుల తలంపులు తెలుసుకోని జనాలు;
ఇదందీ సంగతి - ఎన్నికల వేళ ;
గగ్గోలల గందరగోళం  !!