Tuesday, July 11, 2017

తనను కలవాలనే కల !!!

తానెవరో తెలియాలనే,
తపనెందుకో రగిలే నాలో!
తన ఊహలో తమకం ఇదా!
తెలిపేదెలా? మది మాటునా!

సందేశాలన్నీ సంద్రాలైనా;
మొమాటాల లోతులు ,అరికాళ్ళే
తడపవుగా!

యంత్రాలన్నీ చెంతన ఉన్నా;
ఎదలో సడులేవి యథేచ్ఛగా
తెలుపవుగా!

అందుకె కాబోలు , తననే నేరుగా
కలవాలనే కలనే..
పగలే కంటున్నా!

తనకు ఇలానే ఉండాలనే;
నేర్పుగా కాంక్షను;
నిజమయ్యేట్టుగా కదిలిస్తున్నా!

Wednesday, June 21, 2017

మురిపపు చినుకు ::

మురిపం మరిగిన మేఘం చివరన
కురిసిన చినుకు నువ్వని..
నేలను తాకగా మైమరపే
నీ నవ్వుగా మారని..
ఎద లో లోతుగా లోటులు
నేడే నీ రాకతో తీరని..
ఆ తొలకరి జల్లుకు
చల్లగా గుండెలు తడవని...
ఆ పై మనసే మట్టి తో
కలిసి ఏరు గా పారని..
ఆ ఏటి నీటికి ఎదిగిన
మానుగా నే మిగలని...    

Monday, March 27, 2017

గాడి తప్పిన ఉగాది ::

ఆరు ఋతువుల యేడు గడువగా ,
మరల వచ్చెను ఆమని..
శిధిలమైన మోడు చివరన ,
చిగురు పూతను రమ్మని..
గుబాళించెను గాలిలోన ,
పిందె మామిడి గుమ్మని..

ఇలా..
అనగనగా వాసంతమనీ ,
కాలపు కథలు చెప్పనీ ..

నేడు చూస్తే ఎండలు ..
ఏడ చూసినా మంటలు ..
నీడ లేక,గాలి రాక..
ఉసూరు విసిరెను ఊపిరి..

చెట్టు చుట్టం దూరమవ్వగా,
పలకరింపే కరువయ్యెను..
ప్రకృతమ్మను గెంటివేయగా,
నేడు అయితిని  అనాథను..

రక్ష రక్ష .. నిలుపు శిక్ష ..
ఇంక చాలు లెమ్మనీ ,
లెంపలేసుకుని అడుగుదామా?
ప్రాణభిక్షను  ఇమ్మనీ ..

తారు అడవి నడుమలోన ,
తఱువు నీడను నిలుపుదాం..
మనతో బాటుగా, మనతోడ్పాటుగా,
ప్రకృతి పెద్దమ్మను పెరగనిద్దాం ..