Monday, January 16, 2023

బలం - బలగం

బలగం బలం గా భావించా...

బలహీనత అని తెలిసేసరికి 

జాప్యం జరిగింది ..

ఏ దారం పై ఆధారపడితే

పతంగు లా ఎగిరానో..

అది తెగిన వేళ నేల కు

రాలి పడతానని తెలిసేసరికి

జాప్యం జరిగింది ..

నూ నె ను నమ్ముకున్న ప్రమిదల ఉండాలా.. 

కార్చిచ్చు మల్లె.. ఎగసి అడివిని ఆరగించాలా..

అంతర బల ప్రదర్శనకు దిగాలా

ఆంతర్య బలదర్శన కై ఆగాలా

పక్కన నిలబడని ప్రపంచాన్ని నిందించాలా..

ప్రపంచం తో కలబడే వాళ్ళ పక్క నిలబడాలా..

సశేషం అంటూ.. సాగతీయాలా..

శేషం లేకుండా సమాధి చేయాలా..





Sunday, February 2, 2020

నాలో నువ్వై || నీలో నేనై

నాలో నువ్వై || నీలో నేనై
*********************

మదిలో మొదలై ఎదలో ఎడమై..
ఎదలో రాగం మదిలో మౌనం..

మదిలో పాటై ఎదలో ఎడబాటై..
ఎదలో వసంతం మదిలో శిశిరం..

మదిలో చెలివై ఎదలో చినుకై..
ఎదలో ప్రణయం మదిలో ప్రళయం..

మదిలో సఖివై ఎదలో అతిథై..
ఎదలో గమనం మదిలో గమ్యం..

మదిలో విధియై ఎదలో వ్యధనై..
ఎదలో గారం మదిలో భారం..

మదిలో వరమై ఎదలో రవమై..
ఎదలో అమరం మదిలో సమరం..

మదిలో పలుకై ఎదలో పలుగై..
ఎదలో గేయం మదిలో గాయం..

మదిలో మెరుపై ఎదలో ఉరుమై..
ఎదలో యోగం మదిలో యాగం..

మదిలో అలవై ఎదలో శిలనై..
ఎదలో పదిలం మదిలో శిధిలం..

మదిలో కొలువై ఎదలో కలనై..
ఎదలో కవనం మదిలో ఖననం..

మదిలో ఆశై ఎదలో అడియాశై..
ఎదలో యజ్ఞం మదిలో స్థితప్రజ్ఞం..

మదిలో ధ్యాసై ఎదలో శ్వాసై..
ఎదలో ధ్యానం మదిలో దైన్యం..

మదిలో శిశువై ఎదలో శవమై..
ఎదలో జననం మదిలో మరణం..

Monday, October 28, 2019

నేను ఎవరు?

మూసిన తలుపుల
లోపల ముగిసెను ఓ ప్రాణం!!
సూర్యుని రాకతో
మసిగా మారెను ఓ ప్రాణం!!
వెంబడే రాబందుల
వేటకు ఒరిగెను ఓ ప్రాణం!!
సారపు భూమి లో
కూరుకు పోయెను ఓ ప్రాణం!!
కురిసే వర్షములోనూ
కాలిపోయెను ఓ ప్రాణం!!
కపటపు నవ్వులలో
నలిగెను ఓ ప్రాణం!!
అణచిన దేవుడే
మరచిన ఓ ప్రాణం!!
తనువుకు చావును
తెచ్చేటి ఓ ప్రాణం!!

ఎవరూ..??
నేను ..ఎవరూ??..
ఎవరూ..??
నేను..  ఎవరూ??..

నువ్వు  వెలుగు..
మరి నేను.. ఎవరు?

నువ్వు  వర్షం
మరి నేను.. ఎవరు?

ఓ.. ఎవరూ..? ఎవరూ...?

రైలు వెతికి వచ్చి చచ్చిపడిన..
నేను ఎవరు?

పూల చెట్టుకు వేలబడుతున్న..
నేను ఎవరు?

నదిలో చచ్చిన మీనులా తేలుతున్న..
నేను ఎవరు?

కుమ్మరి గుడిసెలో కాలిపోతున్న..
నేను ఎవరు?

సామి రథాలు చేరువకాని..
నేను ఎవరు?

మీరు ముట్టని నీరు తాగే
నేను ఎవరు?

ఊరు గోడకు  నెట్టబడిన..
నేను ఎవరు?

మీ మలాల గుంట లో శ్వాస విడిచిన..
నేను ఎవరు?


నాదే ఏలుబడి అని చెప్పారు..
నేను బానిసను అనీ అనుకున్నారు

దుక్కి దున్నిన చేతులు
పోరు చేసే చేతులవునా?


చావు లోనూ.. నీలంగా మారుతున్న
నేను ఎవరు?

పూడిస్తే ..నీలసంద్రంలో తేలుతున్న
నేను ఎవరు?

చావు లోనూ ..నీలంగా మారుతున్న
నేను ఎవరు?

పూడిస్తే ..నీలసంద్రంలో తేలుతున్న
నేను ఎవరు?

Credits: " Naan Yaar" song
Film : Pariyerum Perumal ( 2018 Tamil)

Wednesday, April 24, 2019

నీకూ నాకూ అంతరం

బ్రహ్మ అంటావు నువ్వు..
భ్రమ అంటాను నేను..
కులం అంటావు నువ్వు..
గుణం అంటాను నేను..
విశ్వాసం అంటావు నువ్వు..
శ్వాస అంటాను నేను..
దైవం అంటావు నువ్వు..
దైవకణం అంటాను నేను..
మరుజన్మంటావు నువ్వు..
ఉన్నదొకటి చాలంటాను నేను..
పురాణాలంటావు నువ్వు..
పురాతనం అంటాను నేను..
నవగ్రహాలు అంటావు నువ్వు..
సూర్యచంద్రులు గ్రహాలే కాదంటాను నేను..
వాస్తు అంటావు నువ్వు..
వేస్టు అంటాను నేను...
భక్తి అంటావు నువ్వు..
యుక్తి అంటాను నేను..
ఉందంటావు నువ్వు..
లేదంటాను నేను..
అనంతం అంటావు నువ్వు..
అంతరం అంటాను నేను..

Wednesday, January 16, 2019

నిరర్ధపు కుల గళం...

రాష్ట్రం దాటితే 99% మంది కులాల పేర్లు కూడా ఎవడికీ తెలీదు...
దేశం దాటితే పాస్ పోర్ట్ మినహా  మరో గుర్తింపు ఉండదాయే..
గొప్పదని డప్పేసుకునే నీ కుల వృత్తిని చేయటానికి నీకు  చేతకాదు చేయి రాదు ..
ఇంక ఎంత చదివి ఏం లాభం ...
నోటి దుర్గంధం చేతి దురద ..
పక్క తడిపే
స్వీయనియంత్రణ లేని
పనికి రాని పిల్లి కూత లే
నీకు గాండ్రింపు లు
కొవ్వు పేరుకుపోయి
ప్రవహించు చిక్కని రక్తం
కలిగించే గుండె పోటు
కదా నీ కుల గళపు ఠీవి!!

Thursday, September 13, 2018

దిశ లేని గమ్యం.. పస లేని పద్యం..

ఏ దిశగా ఉన్నానో...నేనేమి చేస్తున్నానో...
ఏ గమ్యం కోరానో.. ఏ దూరానున్నానో..

తెలియని తలయని..
మనుషుల నడుమన
ఇరుకున కూరుకున్నానా!
కలియని కలయని..
కసురున విసురున
కపటం కూడుకున్నానా!!

అర్థాన్ని నిర్ధారించని
నికృష్టపు నీ కృషిని
అర్ధించి ఆరాధించి
ఆ పై వగచే వేలా!!
తడిసేలా తల్లడిల్లాలా..
కకావికళంగా క్రుంగాలా..!!

తామసి మసి తుడిచి
కర్కసి కసి కనబర్చి
కత్రువు శత్రువు నెఱిఁగి
కళ్ళ పుసలు తొలచి
అసలు ఆశలు గూర్చి
మసలు ఓరిమి తో ..!!







Tuesday, May 29, 2018

భారతీయ సమాజంలో బంధాలు vs. బ్లాక్మెయిల్ :


తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు , స్నేహితులు ఇలా అనుబంధాల మాటున తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఒకరిపై మరొకరు రుద్దటానికి మన సమాజం లో సిద్ధంగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఈ ముసుగులో లేదా బుజ్జగించో ,భయపెట్టో ,తిట్టి కొట్టో , లేదా చస్తామనో బ్లాక్మెయిల్ చేసో లేదా చంపుతామని బెదిరించో ఇలా ఏదో విధంగా తమ పంతం నెగ్గుకురావడం కోసం ఎంత కైనా తెగిస్తారు. అందుకే ఈ ఆత్మహత్యలు , పరువు హత్యలు, వరకట్న వేధింపులు , సాధింపులు ఇలా  రకరకాలు మనం తరచూ చూస్తుంటాము. భారతీయ సమాజము, సంప్రదాయం ,గౌరవం ,పద్ధతి  ఇలా వివిధ పేర్లతో  జబ్బలు చరుచుకొని గొప్పలు చెప్పుకుని చేసే దారుణాలు ఇవి. నిజానికి ఇవి "exploitation",  " atrocity", " harassment " కోవ లోకి చెందినవి అయినా మన కుటుంబస్తులు లేదా దగ్గరి వాళ్ళు చేసేవి కాబట్టి వీటికి ఆ పేర్లు ఆపాదించకూడదు అనుకుంటాం. అన్నదమ్ముల మధ్య సక్యత ఉండదు గానీ కులం , మతం అంటూ డింభాలు పలుకుతారు. తినటానికి కక్కుర్తి పడి ఏడుస్తూ ఉంటారు , ఏ సాధువో పంతులో పాస్టారో సాయిబో సెలవిస్తే వేలకు వేలు తగలేస్తారు. అలా ఎవడో బయతోడి మాటకు ఇచ్చే గౌరవం విలువ ఇంట్లో వాళ్లకు కూడా ఉండదు. ఇదో విచిత్ర రోగం మన సమాజంలో. పరువు, మర్యాద, కులము, సమాజము పక్కింటోల్లో, ఎదురింటి వాళ్ళ మాటలు వీళ్లకు ముఖ్యం. మిగతాదంతా సీరియల్ లో మెలో డ్రామా మాత్రమే. పెద్దరికం ముసుగులో తమ పంతం నెగ్గుకు రావచ్చు, కాదు కూడదు అన్నారా... నీకు కుటుంబ విలువలు లేవు, అనుబంధాల విలువ తెలియదు, స్వార్ధపరుడవు, తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అత్తమామలు అన్న గౌరవం మర్యాదలు లేని మృగానివి , అనాగరికుడివి , కర్కసుడివి  ఇలా నీలాపనిందలు తప్పవు. అతి కొద్ది కుటుంబాలు మినహా అత్యధిక శాతం ఈ కోవకు చెందిన కుటుంబాలే. కాకపోతే బయటకు చెప్పుకోము, చెప్పుకోకూడదు గా. ఎంతైనా మనకు prestige ప్రాబ్లెమ్ ఎక్కువ అసలు విషయం కన్నా! మనకు జీవితం కన్నా ఉహాజనీతమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. ఎలాగైనా మటుకు మన ఇగోల తృష్ణ ,కండూతి తీరిపోవాల్సిందే.
నోట్1:చాలా మంది దృష్టిలో ఇది మన సమాజం పై , కుటుంబ వ్యవస్థలపై విదేశీయులు డబ్బులు వెదజల్లి  చేయిస్తున్న దాడి .సినిమాల వల్ల చెడిపోయిన యువతరం చేస్తున్న పిచ్చి ప్రేలాపన. ఇలానే అనుకుని స్వయంతృప్తి పొందండి. ఎక్కువ ఆలోచించకండి.
నోట్2: నీ ఇంట్లో ప్రాబ్లెమ్ ని ఇలా రాసావా అని అడిగే వాళ్ళు , ఆలోచించే వాళ్ళు ఎక్కువ. నేను రాసింది నేను చూసిన సమాజం గురించి. అది ఒక ఇంటికి పరిమితం అయితే ఇంత రాయాల్సిన అవసరం లేదేమో!
నోట్3: ఇది నీ అపరిపక్వత,ఆవేశం, నెగటివ్ థింకింగ్ అంటారు. అవును పైన చెప్పిన "నీలాపనిందలు" అకౌంట్ లో ఈ పదాలు జమా చేయటం మరిచిపోయా. ఎవరి అభిప్రాయం వాళ్లది. మీ అభిప్రాయం తో నేను ఏకీభవించచ్చు , వ్యతిరేకించచ్చు కానీ నా ఉద్దేశాలు మీ పై రుద్దను.
నోట్4: ఇంక ఈ నోట్ లు చాలు.ఇలా అందరికి సంజాయిషీ ఇస్తూపోలేను. మీకు నచ్చినట్టు మీరు అనేసుకోండి. మీరు ఏదో అనుకున్నారని , అనుకుంటారని నేను పెద్దగా ఫీల్ కాను.